అవినీతి అధికారులతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం

June 17, 2026
img

తెలంగాణలో ఏసీబీ అధికారుల వలలో అవినీతి తిమింగలాలు వరుసగా చిక్కుతూనే ఉన్నాయి. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు నివాసాలు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ చేపట్టింది.

ఏసీబీ అధికారులు నరహరి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు అయన మంచం కింద, అటక మీద కోట్ల రూపాయల నగదు చూసి షాక్ అయ్యారు. మంచం కింద ఏర్పాటు చేసిన కప్ బోర్డులో, అటక మీద కలిపి రూ.1.54 కోట్ల నగదు కనుగొన్నారు. 

బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల నిల్వలు, రూ.5.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు గుర్తించారు. అలాగే 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. 

నరహరికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక ఖాళీ స్థలం, రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, మహబూబ్‌నగర్‌లో 1.24 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఓ జీ+ త్రీ భవనం, చౌటుప్పల్‌లో మరో నివాస భవనం కూడా ఉన్నట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నరహరి భార్య పేరుతో ఉన్న మరో రెండు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు.

వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల ఇళ్ళలో పట్టుబడుతున్న కోట్ల రూపాయల అవినీతి సొమ్ము, కేజీల కొద్ది వెండి బంగారు ఆభరణాలు, వందల కోట్ల విలువగల స్థిరాస్తులను చూస్తున్న తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. ఇటువంటి అవినీతి అధికారుల వలన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉంది.

Related Post