తెలంగాణలో జనసేన ప్రస్థానం బిజేపి పద్దతిలోనా లేక...

June 20, 2026


img

తెలంగాణలో జనసేన పార్టీకి పదేళ్లకు పైగా చరిత్ర ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావమూ చూపలేకపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే దృష్టి పెట్టి వాటితో బిజీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నంలో హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అదేమీ అంత గొప్ప విషయం కాదు.

అయితే తెలంగాణలో జనసేనకు అడుగడుగునా ముళ్లబాటలే స్వాగతం చెపుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు ఇప్పటికే చాలా బలంగా ఉన్నాయి. వాటి ప్రభావంతో పాటు తెలంగాణ ఉద్యమ ప్రభావం, ప్రాంతీయ భావోద్వేగాలు ఇప్పటికీ ప్రజలపై బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అవసరమా? అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్‌ సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

పవన్ కళ్యాణ్‌కు వ్యక్తిగతంగా యువతలో గుర్తింపు ఉంది. అవినీతి ఆరోపణలు లేకపోవడం, సినీ అభిమాన వర్గం ఉండటం పార్టీకి కొంత బలం ఇవ్వొచ్చు. కానీ ఇవన్నీ ప్రజాదరణకు కొంతవరకు దోహదపడతాయి తప్ప గమ్యం చేర్చలేవు.

జనసేన ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నందున తెలంగాణలో ముస్లిం ఓటర్లను ఆకర్షించాలంటే తెలంగాణలో బీజేపీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది.

కానీ ప్రధాని మోదీ సూచన మేరకు పవన్ కళ్యాణ్‌ తెలంగాణలో జనసేనను యాక్టివ్ చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది.

కనుక బీజేపీతో కలిసి సాగాలనుకుంటే ఒక విధంగా, లేకుంటే మరోవిధంగా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. ఏవిధంగా చేసినా ప్రజల నమ్మకం పొందగలగాలి. అదే చాలా కష్టం.

పవన్ కళ్యాణ్‌ ఏ పద్ధతిలో రాజకీయాలు చేసినప్పటికీ జనసేన వలన తెలంగాణలో పార్టీల ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. కనుక తమకు పోటీగా వస్తున్న జనసేనను, దాని అధినేత పవన్ కళ్యాణ్‌పై ఇప్పటికే అవి ‘ఆంధ్రా ముద్ర’ వేసేశాయి. కనుక ఆ ముద్ర తొలగించుకొని తెలంగాణ ప్రజల అభిమానం, నమ్మకం పొందడం ఇంకా కష్టం.

తెలంగాణలో జనసేన ఎదుర్కోవలసిన ఈ ఆటుపోట్లు గురించి పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసు. కానీ ఏపీ రాజకీయాల్లో ఏవిధంగా పదేళ్లపాటు డక్కామొక్కీలు తిని ఎట్టకేలకు అధికారంలోకి వచ్చినట్లే, తెలంగాణలో కూడా సుదీర్ఘ పోరాటాలు, ప్రస్థానానికి సిద్ధపడి వస్తున్నట్లయితే ఎంత చిన్న విజయమైనా, ఎంత పెద్ద అపజయమైనా జనసేనకు ఇబ్బంది కలిగించదు.


Related Post