కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాసు పీకిన సిఎం సర్

June 25, 2026


img

నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుదవారం ఉదయం టిపీసీసీ అధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు.        

ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సర్’ వలన నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు గుర్తించి అప్రమత్తం అయ్యాయి. కానీ కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఎందువల్ల? మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు?” అని నిలదీశారు.  

సర్ విషయంలో ప్రతిపక్ష బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌ కంటే చాలా చురుకుగా ఉన్నాయని వివరిస్తూ, “బీఆర్ఎస్‌ పార్టీ ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి ఈ ప్రక్రియలో తమ పార్టీ ఓటర్ల పేర్లు తొలగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. 

నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈ బాధ్యత తీసుకొని పని చేస్తున్నారు. చివరికి క్యాడర్ కూడా లేని బిజేపి కొత్తగూడెంలో ‘సర్’ కోసం పార్టీ నేతలతో సమావేశం పెట్టుకొని అప్రమత్తం చేసింది. కానీ కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలలో ఏ మాత్రం చలనం లేదు. 

మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందంటే చూస్తూ సహించను. అందరికీ పది రోజులు గడువు ఇస్తున్నా. తీరు మార్చుకోకపోతే ఈసారి టికెట్ దొరకదని గుర్తుంచుకోండి. వచ్చే ఎన్నికలలో మీ స్థానంలో మరొకరికి టికెట్ ఇచ్చేందుకు వెనకాడను,” అని సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.


Related Post