ఫామ్‌హౌసులో కాలక్షేపం చేసేవారికి అధికారం దేనికి? గువ్వల

June 24, 2026


img

అచ్చంపేట మాజీ గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌ పార్టీ అధిష్టానం సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ హయంలో ప్రభుత్వ విప్‌గా, బీఆర్ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన అయన, 2025లో పార్టీకి రాజీనామా చేసి బిజేపిలో చేరారు. కనుక ఇప్పుడు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, సీనియర్ నేత హరీష్‌ రావులపై విమర్శలు గుప్పించడం సహజమే. 

ఈరోజు ఆయన మహబూబ్‌నగర్‌లో బిజేపి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని చక్కగా పాలించి అభివృద్ధి చేయమని బీఆర్ఎస్‌ పార్టీకి అధికారం కట్టబెడితే, పదేళ్ళలో కేటీఆర్‌, హరీష్‌ రావు ఇద్దరూ తర్వాత నేను ముఖ్యమంత్రినవుతానంటే నేనవుతా అంటూ ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయాలు చేశారు. అందువల్లే ప్రజలు బీఆర్ఎస్‌ పార్టీని గద్దె దించారు. కానీ నేటికీ వారి తీరు మారలేదు. 

ఇక కేసీఆర్‌ పదవి, అధికారం ఉంటేనే శాసనసభకు, ప్రజల మధ్యకు వస్తాను లేకుంటే ఫామ్‌హౌసులోనే కాలక్షేపం చేస్తానన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం పదవి, అధికారం కోసం ఆరాటపడేవారికి, ఫామ్‌హౌసులో పడుకున్న కేసీఆర్‌కి ప్రజలు మళ్ళీ ఎందుకు ఓట్లు వేసి గెలిపిస్తారు? 

బీఆర్ఎస్‌ అధిష్టానం ఈవిధంగా వ్యవహరిస్తున్నందునే వారిని ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. కానీ ఈసారి మమ్మల్నే ఎన్నికలలో గెలిపించి అధికారం కట్టబేడతారని పగటి కలలు కంటున్నారు. వాళ్ళ కల ఎన్నటికీ నెరవేరదు,” అని గువ్వల బాలరాజు అన్నారు.                 



Related Post