జూలై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

June 30, 2026
img

హైదరాబాద్‌లోని ఐఐఐటీ జంక్షన్ వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో జూలై 1 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

నిర్మాణ పనులకు ట్రాఫిక్ వలన ఆటంకాలు లేకుండా చేసేందుకుగాను డీఎల్ఎఫ్ గేట్ నెం.1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రహదారిని 90 రోజుల పాటు మూసివేయనున్నారు. అయితే పనుల పురోగతిని బట్టి దశలవారీగా రహదారిలో వాహనాలను అనుమతిస్తారు. 

రాడిసన్ హోటల్ వైపు నుంచి ఐఐఐటీ జంక్షన్‌కు వచ్చే వాహనాలను డీఎల్ఎఫ్ గేట్ నెం.1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి గచ్చిబౌలి జంక్షన్, ఇందిరానగర్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.

లింగంపల్లి వైపు నుంచి డీఎల్ఎఫ్ రోడ్‌కు వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలు ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, రాడిసన్ జంక్షన్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

అయితే టీసీఎస్ నాన్-ఎస్‌ఈజెడ్ (సీఎంసీ) గేట్‌ను ఉపయోగించే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న మార్గంలోనే రాకపోకలకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉన్నందున గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.

Related Post