కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, అన్ని రంగాలను భ్రష్టు పట్టించేస్తోందని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేయని రోజు లేదు. కానీ వాస్తవం ఏమిటంటే, నాడు బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది. పైగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతోంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మెరుగుపరిచే దిశగా భారీ ప్రాజెక్టులను చేపడుతోంది.
హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (హ్యామ్) తొలి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.13,006.27 కోట్లు ఖర్చు చేయబోతోంది. దీంతో మొత్తం 6,092.37 కిమీ మేర కొత్తగా రోడ్లు నిర్మించనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో జరుగబోయే ఈ హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో బాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయబోతున్నారు.
దీని కోసం ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా నల్గొండ జిల్లాలోని కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ ‘హ్యామ్ పైలాన్’ ఆవిష్కరిస్తారు.
అనంతరం హెలికాప్టర్‌లోనే నల్గొండ డీటీసీ కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి ఎన్టీఆర్ కళాశాలకు వెళ్లనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.