రైతు భరోసా నిధులు నేడే విడుదల

June 30, 2026


img

తెలంగాణ రైతులకు ఓ శుభవార్త! సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరుగబోయే ‘రైతు ఆశీర్వాద సభ’లో బటన్ నొక్కి ఖరీఫ్‌ 2026-27 సీజన్‌కు రూ. 2,482.02 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు. 

ముందుగా రెండు ఎకరాలు అంత కంటే తక్కువ భూమి ఉన్న 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు నేటి సాయంత్రం నుంచే నేరుగా జమ కాబోతున్నాయి. .

తర్వాత రెండో విడతలో రెండు ఎకరాలకు మించి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. 

కొత్తగా సాగు భూముల వివరాలు, అర్హతల పరిశీలన, భూ రికార్డుల ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన రైతులు కూడా ఈ పధకానికి అర్హులే. కనుక రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 

రైతు భరోసా అమలులో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు సాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం, భూ రికార్డుల సమస్యలు ఉన్న రైతులు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది. ఈ సొమ్ము నుంచి రైతుల పాత బాకీలు, వడ్డీలను మినహాయించుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం ముందే బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కనుక లబ్దిదారుల చేతికి పూర్తి సొమ్ము అందబోతోంది.  


Related Post