ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

June 30, 2026


img

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6,000 కోట్ల బకాయిలను 100 రోజుల్లో పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

ఇప్పటికే మొదటి విడతలో రూ.2,000 కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడతగా మరో రూ.2,000 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ.4,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించినట్లయింది. మిగిలిన రూ.2,000 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. 

మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యుటేషన్ బిల్లులను చెల్లించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్) బకాయిలు, కమ్యుటేషన్ బకాయిలు, ఇతర పెండింగ్ చెల్లింపుల కోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 

ఉద్యోగుల వైద్య బిల్లులు, స్కాలర్‌షిప్ బకాయిల చెల్లింపులను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మిగిలిన బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.


Related Post