కేసీఆర్‌ సిఎం కావాలని ఎవరు కోరుకుంటున్నారు? రేవంత్ ప్రశ్న

July 01, 2026


img

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌, శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. దీనిలో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు పాల్గొని సభకు హాజరైన రైతులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. 

మాజీ సిఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులో పడుకుంటున్న కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారట! ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి, రాష్ట్రాన్ని దోచుకొని వేలకోట్లు పోగేసుకున్న అటువంటి వ్యక్తి మళ్ళీ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటారా?

తెలంగాణ ఏర్పడినందుకు ఒక్క కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగుపడింది. అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆయన ఫామ్‌హౌసులో పడుకుంటే, పిల్ల రాక్షసులు రాష్ట్రంలో తిరుగుతూ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.

మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడతారు. మెట్రో పొడిగిస్తామంటే అడ్డుపడతారు. ఏ అభివృద్ధి పని మొదలుపెట్టినా దుష్ప్రచారం మొదలుపెట్టి అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌ నేతలు పదేపదే నన్ను రాజీనామా చేయమని కోరుతున్నారు? నేను ఎందుకు రాజీనామా చేయాలి? అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్నందుకా?  రైతులను ఆదుకుంటునందుకా?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.     

“కేసీఆర్‌ తన కుటుంబానికి ఉద్యోగాలు కల్పించుకోగా, ప్రధాని మోడీ రాష్ట్రంలో కిషన్ రెడ్డికే, బండి సంజయ్‌కి ఉద్యోగాలు కల్పించారు. బిజేపి కానీ బీఆర్ఎస్‌ పార్టీ గానీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. మా ప్రభుత్వం ఈ 30 నెలల్లోనే అనేక పనులు చేపట్టి పూర్తి చేసింది.

మేమేమీ కేసీఆర్‌లా గడీలలో దాక్కోవడం లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నాము కనుకనే మేము నిత్యం ప్రజల మద్యనే ఉంటున్నాము. ఇది ప్రజా ప్రభుత్వం. దీనిని కంచె వేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.


Related Post