అహ్మదాబాద్‌ ప్రేలుళ్ళ కేసులో సంచలన తీర్పు: 38 మందికి ఉరిశిక్ష

July 07, 2026


img

యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిన అహ్మదాబాద్‌ వరుస బాంబు ప్రేలుళ్ళ  కేసులో గుజరాత్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఈ కేసులో 38 మంది దోషులకు ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. అలాగే మరో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కూడా యథాతథంగా కొనసాగించింది.

2008 జూలై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు ప్రేలుళ్ళు  జరిగాయి. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. 

ఈ కేసు సుదీర్గ విచారణ  తర్వాత ప్రత్యేక కోర్టు 2022లో 49 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ప్రత్యేక కోర్టు తీర్పుపై దోషులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా వారికి ఉరిశిక్షలు ఖరారు చేసింది. దేశంలో ఇంతమందికి ఒకేసారి ఉరిశిక్షలు విధించలేదు కనుక ఈ తీర్పు అత్యంత సంచలనమైనదే అని చెప్పవచ్చు.

అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కనుక ఈ కేసు విచారణ మరికొన్ని నెలలు లేదా ఏళ్ళు కొనసాగే అవకాశం కనిప్పిస్తోంది.


Related Post