కాళేశ్వరం: కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ మూడు స్థంభాలట!

July 12, 2026


img

మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పియర్స్ క్రుంగిపోగా, కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ వాటితో మూడు స్థంభాలట ఆడుకుంటున్నాయి. మూడు పరస్పరం నిందించుకుంటూ ‘తప్పు మీదంటే మీదని’ నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యర్ధులను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గురించి కాంగ్రెస్‌ చేస్తున్న వాదనలు లేదా ఆరోపణలు వింటూనే ఉన్నాము. ఇంతకాలం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధీటుగా జవాబు చెప్పలేక తడబడిన మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ఎదురుదాడి చేస్తున్నారు. 

మేడిగడ్డ వాడకపోయినా కన్నెపల్లితో సహా మిగిలిన పంప్ హౌసులలో మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు? నీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు? అంటూ గట్టిగా నిలదీస్తున్నారు. దిగువన ఏపీలో పట్టిసీమ పంపులు ఆన్‌ చేసుకొని గోదావరి నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. అంటే ఇక్కడ నీళ్ళు లేవని సిఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెపుతున్నారన్న మాట,” అంటూ కేటీఆర్‌, హరీష్‌ రావులు గట్టిగా వాదిస్తున్నారు. 

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు గోదావరి నీళ్ళలో ఈవిధంగా జలకాలు ఆడుతుంటే బిజేపి నేతలు నిమ్మకు నీరెత్తినట్లు పట్టన్నట్లు ఉండిపోతే వారికే నష్టం. కనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బరిలో దిగి, “కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని కనిపెట్టి చెప్పింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. దానిపై కమీషన్ కూడా వేసి విచారణ జరిపించింది కూడా. అదే అధికారంలో ఉంది. కానీ ఇంతవరకు అది దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిందిస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసులు, ఏసీబీ వగైరా వ్యవస్థలు ఉన్నాయి కదా? కానీ వాటిని ఉపయోగించుకొని చర్యలు తీసుకోకుండా సీబీఐ విచారణకి ఎందుకు పట్టుబడుతోంది? అంటే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య రహస్య అవగాహనా ఉన్నందునే. లేకుంటే కాళేశ్వరంలో అవినీతికి పాల్పడినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉండేది,” అని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

వ్యవసాయ రంగానికి ఉపయోగపడాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు చివరికి మూడు పార్టీలు ఈవిధంగా రాజకీయాలు చేసుకునేందుకు ఉపయోగపడుతోంది. ఇది చాలా బాధాకరమే కదా?


Related Post