జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కోలీవుడ్ నటుడు ఆర్య (జంషాద్ సి)పై కేసు నమోదు అయింది. అతనితో పాటు ‘అనంతన్ కాడు’ సినీ నిర్మాత వినోద్, చిత్ర బృందంపై కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, వారు తమ సినిమా షూటింగ్ కోసం జూబ్లీహిల్స్‌లోని తాహెర్ సినీ టెక్నిక్ అనే సంస్థ నుంచి అత్యంత ఖరీదైన డిజిటల్ కెమెరాలు వగైరా అద్దెకు తీసుకున్నారు.
వాటికి రూ.2.12 కోట్లు అద్దె చెల్లించేందుకు గత ఏడాది ఫిభ్రవరిలో ఒప్పందం పత్రంపై సంతకాలు చేశారు. కానీ రూ.1.80 కోట్లు మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్ము ఇవ్వకుండా ఎగవేశారు.
దాని కోసం తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ ప్రతినిధులు వారికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పంపినా స్పందించలేదు. ఈ వ్యవహరంలో తమపై కేసు నమోదు అవుతుందని ముందే ఊహించి కేరళ కోర్టుని ఆశ్రయించి అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు కూడా తీసుకున్నారు.
చివరి ప్రయత్నంగా బాకీ సొమ్ము గురించి అడిగేందుకు తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ ప్రతినిధి నేరుగా వారిని కలిస్తే అతనిని వారు బెదిరించారు.
కనుక వారు తమని మోసం చేసినట్లు తాహెర్ సినీ టెక్నిక్ అకౌంటెంట్ పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నటుడు ఆర్యతో సహా నిర్మాత, చిత్ర బృందంపై కేసు నమోదు చేశారు.
సినీ పరిశ్రమలో ఆర్ధిక లావాదేవీలకు లిఖితపూర్వకంగానే జరుగుతుంటాయి. కానీ నిర్మాణ సంస్థ, దర్శకులు, హీరోలపై నమ్మకంతో జరిగేవే ఎక్కువ. ఆ నమ్మకం పోగొట్టుకున్నప్పుడు ఈవిధంగా పోలీస్ స్టేషన్ లేదా కోర్టు గడప తొక్కక తప్పదు.