ప్రముఖ గాయని ఎస్.జానకి ఇక లేరు

July 12, 2026


img

ప్రముఖ గాయని ఎస్.జానకి ఇక లేరు. శనివారం సాయంత్రం మైసూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో  తుది శ్వాస విడిచారు. ఆమె (88) గత కొంత కాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జానకమ్మ ఇక లేరనే విషయం ఆమె మనుమరాలు అప్సర సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

“ప్రముఖ గాయని, మా నాన్నమ్మ ఎస్.జానకి చనిపోయారనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులా ప్రేమాభిమానల మద్య ఆమె ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు. ఈ ప్రపంచానికి ఆమె గొప్ప గాయని. ఎన్నో తరాల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయే స్వరం. కానీ మా కుటుంబానికి మాత్రం ప్రేమ, ఆప్యాయత, వినయం, దయ, మానవత్వం పంచిన మంచి నానమ్మ. ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని ప్రజలు, అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి. మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రేమ, ప్రార్ధనలు, సానుభూతి తెలియజేస్తున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.       

ఎస్.జానకి 1938, ఏప్రిల్‌ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో జన్మించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీతో సహాయ మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ గాయకులు ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో సహా పలువురుతో కలిసి ఆమె పాడిన పాటలకు లెక్కలేదు. 

సినీ సంగీత రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ అవార్డుతో సన్మానించింది. నాలుగు జాతీయ అవార్డులు, 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, అనేక సినీ అవార్డులు ఆమె అందుకున్నారు. పదేళ్ళ క్రితం ఆమె చివరిగా ‘అమ్మా పోవిను’ అనే మలయాళ పాట పాడారు. అప్పుడే ఇక నుంచి వేదికలపై, సినిమాల కోసం పాటలు పాడనని తెలిపారు. 

తెలుగులో ఆమె పాడిన పాటల్లో ఎన్నటికీ మారువలేని మధురాతి మధురమైనవే ఎక్కువున్నాయి. జానకమ్మ గొంతులో జాలువారిన అనేక పాటలలో..  తొలిసారి మిమ్మల్ని (శ్రీవారికి ప్రేమలేఖ), మంచుకురిసే వేళలో (అభినందన), అరే ఏమైందీ (ఆరాధన), బంటి చామంతీ (అభిలాష), సిరిమల్లె పువ్వా (పదహారేళ్ళ వయసు), మౌనమేలనోయి (సాగర సంగమమ), మాటే మంత్రమూ (సీతాకోకచిలుక) వంటివి అనేకం ఉన్నాయి. 

ఆమె మృతి పట్ల దక్షిణాది సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, ఆమె అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.      



Related Post

సినిమా స‌మీక్ష