ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలి కూడా ఒకరు. ఆమెని పర్యాటక శాఖ బాధ్యతల నుంచి తప్పించి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ రాష్ట్రంలోనైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వసాధారణమే. ఆవిధంగానే ఆమ్రపాలి కూడా బదిలీ అయ్యారనుకోవడానికి లేదు. ప్రభుత్వం ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇస్తుందో లేదో తెలీదు. ఆమెని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించడమంటే శిక్ష కిందే లెక్క. కనుక నిబందనల ప్రకారం ఆమెకు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినా ఈసారి ఇటువంటి కీలకశాఖ అప్పగిస్తుందనే నమ్మకం లేదు.
కానీ తెలంగాణలో పని చేసినప్పుడు మంచి సమర్దురాలైన అధికారిణిగా గుర్తింపు, గౌరవం సంపాదించుకున్న ఆమె పట్ల ఏపీ ప్రభుత్వం ఈవిధంగా ఎందుకు వ్యవహరించింద? అనే సందేహం కలుగవచ్చు.
ఆమె మొదట నుంచి ఆంధ్రాకు వెళ్ళేందుకు ఇష్టపడక న్యాయ పోరాటాలు చేశారు. కానీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళక తప్పలేదు.
ఆమెకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పర్యాటకశాఖని అప్పజెప్పింది. కానీ ఆమె ఎక్కువ కాలం సెలవులోనే ఉంటున్నారు. బహుశః అందుకేనేమో ఆమెని ఆ శాఖ నుంచి తొలగించి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కానీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వాలేదు. కనుక ఆమె విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమాలోచిస్తోందో తెలీదు. ఇప్పుడు ఏ శాఖ, బాధ్యత అప్పగిస్తుందో, ఇస్తే ఆమె ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.