లాల్‌దర్వాజాకు పోటెత్తిన భక్తులు, వీఐపీలు

August 09, 2026
img

హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల సందడి నెలకొంది. నేడు ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో నగరంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, భవాని, మహాంకాళి అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు.ఇంకా చాలా ఆలయాల వద్ద బోనాలు నెత్తిన పెట్టుకున్న మహిళలు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఓపికగా ఎదురుచూస్తున్నారు. 

ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం, బెల్లం సాక, గాజులు, చీరెసారె సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులతో నగరం సందడిగా మారింది. 

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజామునుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు.

అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీధర్ బాబు, అంబర్‌పేట అమ్మవారికి మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మాదన్నపేట నల్లపోచమ్మ అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు.

రాత్రి 10.30 గంటల వరకు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం, చీర, సారె సమర్పణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆదివారం సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఐదు లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మొత్తం 2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు.

సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, గాయని మంగ్లీ అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు.

Related Post