సిఎం రేవంత్ రెడ్డి గురువారం కూకట్‌పల్లిలో ‘ఇందిరమ్మ టవర్స్’కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, “ఇక్కడ ఎకరం సుమారు రూ.200 కోట్లు పలుకుతోంది. అయినా పేద ప్రజలకు కూడా నగరం నడిబొడ్డునే ఇళ్ళు ఉండాలనే ఉద్దేశ్యంతో 11 ఎకరాలు కేటాయించాము. వీటి కోసం అప్పుడే 51 వేల దరఖాస్తులు వచ్చాయి. వారిలో అర్హులను ఎంపిక చేసి బహిరంగంగా లాటరీ పద్దతిలో లబ్దిదారులను ముందే ఎంపిక చేస్తాము.
ఈ ఇళ్ళ పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నేతల సిఫార్సులకు తావు లేదు. ‘ఇందిరమ్మ టవర్స్’లో వారికి ఇళ్ళు కేటాయిస్తూ ముందే పత్రాలు అందిస్తాము. కావాలనుకుంటే వారు దగ్గరుండి తమ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించుకోవచ్చు. వచ్చే ఏడాది ‘ఇందిరమ్మ టవర్స్’ నుంచే బోనం ఎత్తుదాము.
శిల్పారామం వద్ద రూ.1,000 కోట్లు ఖరీదు చేసే 3.5 ఎకరాలు మహిళ సంఘాలకు కేటాయించి అక్కడ వారి చేత ‘ఇందిరమ్మ మహిళా శక్తి స్టాల్స్’ ఏర్పాటు చేయించాము. వాటిని అమెజాన్ వంటి ఈకామర్స్ సంస్థలతో అనుసంధానం చేశాము. ఇప్పుడు ఈ ‘ఇందిరమ్మ టవర్స్’ కట్టించి ఇస్తున్నాము. వీటిపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశించాను,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రజలు హర్షధ్వానాలు చేశారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడులో క్షుద్ర పూజలు చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. కానీ ఎన్ని క్షుద్రపూజలు చేస్తున్నా ఎల్‌నినో ప్రభావంలో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి రిజర్వాయర్లు నిండాయన్నారు. చేతబడి తిరగబడితే వాటిని చేస్తున్నవారే సర్వనాశనం అయిపోతారనే విషయం తెలుసుకోవాలన్నారు.