తెలుగు ప్రజల అభిమాన నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రజలను అలరించిన శ్రీదేవి, బాలీవుడ్ తరలిపోయి హిందీ సినిమాలకే పరిమితమయ్యారు. కానీ అక్కడా తనకు సాటిలేదని నిరూపించుకుంటూ అనేక హిట్స్ అందించడం తెలుగు ప్రేక్షకులకు చాలా సంతోషం కలిగించాయి. కానీ తన కంటే వయసులో చాలా పెద్దవాడైన నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్ళి చేసుకోవడం, కుటుంబం కోసం సినిమాలకు దూరం అవడం, దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం నేటికీ తెలుగు అభిమానులు జీర్ణించుకోలేరు.
ధీరజ్ యూ కుమార్ అనే రచయిత ఆమె జీవిత చరిత్రని ‘ఎంప్రెస్: దిడెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ అనే పేరుతో పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చారు. దాని ఆధారంగా ఇప్పుడు శ్రీదేవి బయోపిక్ తీయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర ఎవరు చేస్తారు?ఆమె జీవిత చరిత్రని ఎక్కడి నుంచి ఎక్కడ ముగిస్తారు? ఎవరు దర్శకత్వం చేస్తారు? ఎప్పుడు మొదలుపెడతారు? సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘మహానటి’ సినిమాలా, ఇది కూడా అలరిస్తుందా లేదా? వంటి అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించవచ్చు.