తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతల మండలి (టిఎఫ్‌పిసి) ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 17న ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 24న నామినేషన్ల పరిశీలన అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య తుది జాబితాను ప్రకటించనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుది పోటీదారుల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉంటారనేది స్పష్టమవుతుంది.
సెప్టెంబర్ 6న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్‌లోని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు గౌరవ కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, గౌరవ కోశాధికారితో కలిపి మొత్తం 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఈ ఎన్నికల్లో ఎన్నుకోనున్నారు. ఈ మేనేజింగ్ కమిటీ పదవీ కాలం 2028 వరకు ఉంటుంది.