మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి రాగాలు మళ్ళీ షురూ చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “బయట నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. సీమాంధ్ర పాలకుల చెప్పు చేతల్లో మన ప్రభుత్వం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే ఆనాడు ఉద్యమం నడిచింది. కానీ ఇప్పుడు బయట నుంచి వచ్చినవాళ్ళే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పని చేయాలి కానీ సీమాంద్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదు. నాకు పదవుల కంటే పార్టీ ముఖ్యం. నేను రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాను,” అని అన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు. కానీ అది దక్కకపోవడంతో ఇలా అసంతృప్తి సెగలు కక్కుతుంటారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, “కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరిక, ఆవేదన రెండూ నాకు తెలుసు. దేనికైనా సమయం, సందర్భం ఉంటుంది. అంత వరకు ఓపిక పట్టాలి తప్ప ఈవిధంగా మాట్లాడటం తగదు.
పార్టీలో ఆయనకు సముచిత గౌరవం లభిస్తున్నప్పుడు దానిని ఆయన కాపాడుకునేలా వ్యవహరించాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకులలో ఒకరు. అలాంటి వ్యక్తీ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడటం తగదు. పదేపదే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తుంటే అధిష్టానం చూస్తూ ఊరుకోదని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.