షారుఖ్‌, అజయ్‌, టైగర్‌ మీకు పాన్ మసాలా అవసరమా?

August 16, 2026


img

బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

విమల్ ఏలకుల పేరుతో నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో నోటీసులు ఇచ్చింది. ఈ ప్రకటనలో ఏలకుల ఉత్పత్తిని చూపిస్తున్నప్పటికీ, అది విమల్ పాన్ మసాలా బ్రాండ్‌తో ముడిపడి ఉండటంతో,  దానికి ఇది పరోక్ష ప్రకటన అని ఎఫ్‌డీఏ భావిస్తోంది. 

ఈ ప్రకటనకు సంబంధించిన సోషల్ మీడియా కంటెంట్‌ను తొలగించడంతో పాటు, రెండు వారాలలో వివరణ ఇవ్వాలని ముగ్గురు హీరోలను ఆదేశించింది.

మహారాష్ట్రలో పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం అమల్లో ఉంది. దీంతో నిషేధిత ఉత్పత్తులను సెలబ్రిటీల ద్వారా పరోక్షంగా ప్రచారం చేయడంపై ఎఫ్‌డీఏ అధికారులు దృష్టి సారించారు. నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఇదే విమల్ బ్రాండ్ ప్రకటనలో నటించిన అక్షయ్ కుమార్ గతంలో విమర్శల నేపథ్యంలో ఆ యాడ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


Related Post

సినిమా స‌మీక్ష