కూతురు వ్యాఖ్యల గురించి కొండా సురేఖఏమన్నారంటే..

August 20, 2026


img

కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్న మంత్రి కొండా సురేఖ బదులిచ్చారు. తన కూతురు కొండా సుస్మిత సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబందమూ లేదని స్పష్టం చేశారు.

అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తాను బాధ్యురాలిని కానని, అలా చేయడం కూడా తగదని మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్‌ పార్టీపై నాకు అపారమైన గౌరవం ఉంది. పార్టీ క్రమశిక్షణకు నేను కట్టుబడి ఉన్నాను. కనుక నాకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నానని మంత్రి కొండా సురేఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

ఆమె చెప్పింది వాస్తవమే అయినప్పటికీ ఆమె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందున, ఆమె కుమార్తె నేరుగా సిఎం రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఇప్పటికే ఆమె చేసిన ఆరోపణలతో కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరుగుతోందని అందరూ ప్రశ్నిస్తున్నారు.

కనుక మంత్రి కొండా సురేఖ తప్పనిసరిగా తన కుమార్తె సుస్మితని కట్టడి చేయాల్సి ఉంటుంది. లేదా సుస్మితని కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది. కానీ తల్లి కూతురు ఇద్దరూ పార్టీలోనే ఉంటూ ఒకరు విధేయంగా, మరొకరు ధిక్కార స్వరంతో మాట్లాడుతుంటే రాజకీయాలలో కుదరదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా బహుశః మంత్రి కొండా సురేఖకు ఇదే చెప్పే అవకాశం ఉంది. 


Related Post