రాహుల్ గాంధీకి హరీష్‌ రావు లేఖ!

August 20, 2026


img

అవును మాజీ మంత్రి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీకి లేఖ వ్రాశారు. దేనికంటే, తెలంగాణ రెవెన్యూ శాఖలో 22ఏ నిబంధన దుర్వినియోగం జరుగుతోందని, అందుకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బాధ్యుడని కనుక ఆయనని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని లేఖలో కోరారు.

ప్రైవేటు భూములపై కృత్రిమ వివాదాలు సృష్టించేందుకు 22ఏ నిబంధనను ఉపయోగిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ప్లాట్లు, ఇళ్ళను కూడా నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నిజాంపేట్ తదితర ప్రాంతాలలో కూడా ఇలాగే సాగుతోందని పేర్కొన్నారు.  

ఈ 22ఏ జాబితా నుంచి భూములను తొలగించేందుకు మార్కెట్ విలువలో 30 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో విలువైన భూముల యజమానులపై రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలు చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితాలో చేర్చిన, తొలగించిన భూముల వివరాలను జిల్లాల వారీగా బహిర్గతం చేయాలని కోరారు.

తన ఆరోపణలు తప్పని తేలితే చర్యలు తీసుకోవచ్చని, నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మరి దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో.. అసలు స్పందిస్తుందో లేదో.. చూడాలి. 


Related Post