మంత్రి కొండా సురేఖ షోకాజ్ నోటీస్

August 20, 2026


img

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత నిన్న జిల్పలాలోని గీసుకొండలో తన అనుచరులతో సమావేశమైనప్పుడు సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలని ఏ లెక్కన ప్రజలను కోరుతున్నావు? పార్టీలో ఎవరెవరికి టికెట్స్ ఇవ్వాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది కానీ నువ్వెలా నిర్ణయిస్తావు?

నాడు రేవూరిని గెలిపించాలని కోరితే నీ మాట కాదనలేక, మా నాన్న కొండా మురళి ఆయన కోసం నియోజకవర్గంలో ప్రచారం చేసి గెలిపించారు. మా నాన్నకు ఎమ్మెల్సీ ఇస్తానని నాడు హామీ ఇచ్చావు. కానీ రెండున్నరేళ్ళయినా ఇవ్వలేదు.

మా అన్న నాన్న ఇద్దరూ చాలా మంచివాళ్ళు కనుక వాళ్ళని తొక్కేస్తున్నావు. పరకాల నియోజకవర్గం గురించి కనీస అవగాహన లేని ఆ రేవూరిని కారులో కూర్చోపెట్టుకొని వచ్చి, మళ్ళీ ఆయనని గెలిపించాలని ఎలా అడుగుతున్నావు?

వచ్చే ఎన్నికలలో పరకాల నుంచి నేనే పోటీ చేస్తాను... పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా. దమ్ముంటే రేవూరి చేత ఇప్పుడే రాజీనామా చేయించి, ఇద్దరూ కలిసి ఉప ఎన్నికలకు రండి. మా తడాఖా ఏమిటో చూపిస్తాను,” అంటూ కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వెంటనే స్పందిస్తూ, మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ పంపింది. ఆమె కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా, సుస్మిత పార్టీలో ఉంటూ సిఎం రేవంత్ రెడ్డిపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు మూడు రోజులలోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

పార్టీ ప్రతిష్టకు భంగం కల్గించేవిధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, మూడు రోజులలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే , క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చర్యలు తప్పవని షోకాజ్ నోటీసులో స్పష్టం చేసింది. మంత్రి కొండా సురేఖ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. 

(video courtesy-Great Andhra)

Related Post