ఇటీవల సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ దాని క్రెడిట్ క్లెయిం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ రోజు రేవంత్ రెడ్డి కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పార్టీ నేతాలను వెంటపెట్టుకొని అక్కడకు వెళ్ళి, నాడు కేసీఆర్ ఎంతో దూరదృష్టితో టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టారంటూ చెప్పుకొచ్చారు.
నేడు మాజీ మంత్రి హరీష్ రావు టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు బయలుదేరబోతుంటే, పోలీసులు కోకాపేటలోని ఆయన నివాసంలో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డిలను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
హరీష్ రావు స్పందిస్తూ “మేము టిమ్స్ హాస్పిటల్ సందర్శిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? దాని నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాలు, ఆస్పత్రిలో లోపాలు బయటపడతాయనే కదా? ఇలా మమ్మల్ని పోలీసులతో గృహ నిర్బంధాలు చేయిస్తూ, ఎంతకాలం మీ ప్రభుత్వ వైఫల్యాలను దాచి పెట్టగలరు?ఇదేనా ప్రజాపాలన అంటే?” అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలను నేడు టిమ్స్ హాస్పిటల్ సందర్శించకుండా పోలీసులు ఆపగలిగారు. కానీ ప్రతీరోజూ ఆపలేరు కదా? ఈరోజు కాకపోతే మరో రోజైన వారు టిమ్స్ హాస్పిటల్ సందర్శించకుండా ఉండరు.. ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండరు. మరి అటువంటప్పుడు వారిని ఆపి, ఇంకా విమర్శలపాలవడం దేనికి?