ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో తొలుత హీరోయిన్‌గా దీపికా పడుకొణెను అనుకున్నారు. అయితే ఆమెని ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా బయట పెట్టారు.
తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దీపిక వంటి మంచి నటి తన సినిమాలో ఉండాలని దాదాపు ఏడాదిన్నరగా ఆమెతో చర్చలు జరిపారు. ఆమె కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ ఆమె ఇటీవల వరుస విజయాలు అందుకున్నప్పటి నుంచి ఆమె తీరు మారిపోయింది.
ఆమె డిమాండ్లు పెరిగిపోయాయి. భారీ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో 10 శాతం వాటాను ఆమె కోరారు. అంతే కాకుండా షూటింగ్ డేట్స్, పని గంటల విషయంలోనూ కొన్ని షరతులు పెట్టారు. ఆమె మాతో అలా వ్యవహరించి నందునే ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవాల్సి వచ్చింది.
దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. స్పిరిట్ 2027, మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.