తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రచయిత్రి కనికా థిల్లాన్ తన కథా పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నేరుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 3 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
క్లుప్తంగా కథ ఏమిటంటే, ‘జాయ్‌పుర్రా’ అనే కల్పిత నగరంలో సాగే ఈ కథలో తాప్సీ ‘బానీ’ అనే శక్తివంతమైన తల్లి పాత్రలో కనిపించనున్నారు. తన బిడ్డకు ఎదురయ్యే ఊహించని సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఆమె చేసే పోరాటమే కథాంశంగా తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ, మీతా వశిష్ఠ్, జతిన్ సర్నా కీలక పాత్రల్లో నటించారు.