మంత్రి కొండా సురేఖ వద్ద పని చేసిన మాజీ ఓఎస్డీ ఎన్.సుమంత్‌పై మేడిపల్లి పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి గోంగిడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అనంతరం ఆ కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. జులై 30న సుమంత్ తనను కలవాలని హరికృష్ణకు ఫోన్ చేశారు. అదే రోజు రాత్రి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలోని ఆయన కార్యాలయానికి వెళ్ళినప్పుడు, నా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నావంటూ సుమంత్ ప్రశ్నించగా, అలాంటి తప్పుడు ఆరోపణలు చేయవద్దని హరికృష్ణ వాదించారు.
దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన సుమంత్ తనపై ఇనుప రాడ్డుతో దాడి చేశారని, ఆయనతోపాటు ఉన్న మరికొందరు కూడా దాడికి పాల్పడ్డారని హరికృష్ణ ఆరోపించారు.
ఈ ఘటనలో తనకు తీవ్ర గాయాలయ్యాయని, ఆగస్టు 10న శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చిందని హరికృష్ణ పిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో సుమంత్‌తో పాటు రాము, ప్రశాంత్, అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్తిక్, మహేందర్‌రెడ్డిల పేర్లను కూడా చేర్చారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 109 కింద కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొండా సురేఖ కుటుంబం ప్రస్తుతం రాజకీయ వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే ఆమె మాజీ ఓఎస్డీపై తాజా కేసు నమోదు కావడంతో చర్చనీయాంశంగా మారింది.