విదేశీ పర్యటనలో సిఎం రేవంత్‌కు కేంద్రం షాక్!

August 21, 2026


img

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన లండన్ పర్యటనకు అనుమతించిన కేంద్రం, అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. దీంతో లండన్ నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న సిఎం రేవంత్ రెడ్డి, లండన్ నుంచే హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కాక తప్పదు. 

ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రులు తమ విదేశీ పర్యటనలకు సంబంధించి పూర్తివివరాలు విదేశాంగశాఖకు సమర్పించి, దాని ఆమోదం పొందిన తర్వాతే బయలుదేరాల్సి ఉంటుంది. 

కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా సిఎం రేవంత్ రెడ్డి లండన్, అమెరికా పర్యటనల వివరాలను విదేశాంగశాఖకు సమర్పించగా లండన్ పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. కనుక లండన్ బయలుదేరి వెళ్ళారు. అక్కడకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు కూడా అనుమతి లభిస్తుందనే నమ్మకంతో అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

అమెరికాలో పలు యూనివర్సిటీలలో పర్యటించి, విద్యా సంబంధిత భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది. కానీ కేంద్రం అనుమతించక పోవడంతో అమెరికా పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌ తిరిగి రాక తప్పదు. కనుక తనతో విదేశీ పర్యటనకు వచ్చిన అధికారులను అమెరికాలో పర్యటించి, ముందుగా అనుకున్న భాగస్వామ్య ఒప్పందాలు ఖరారు చేసుకొని రావాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.    

కేంద్రం నిర్ణయంపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ప్రపంచస్థాయి విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకు వచ్చి యువతకు అత్యుత్తమైన విద్య అందుబాటులోకి తేవాలనుకున్నాను. ‘వికసిత్ భారత్‌’ కోసం చేస్తున్న ప్రయత్నాలను కూడా రాజకీయ కారణాలతో అడ్డుకుంటే ఎలా?” అని ప్రశ్నించారు. 

ఈ నెల 30 వరకు లండన్, అమెరికాలో పర్యటించాలని సిఎం రేవంత్ రెడ్డి బృందం ఏర్పాట్లు చేసుకుంది. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఈ ఆదివారమే లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ బయలుదేరుతారు.                



Related Post