ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది.
1931 డిసెంబరు 12న రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి.. 11 ఏళ్ళ వయసులోనే రేడియో నాటికల ద్వారా కళా రంగంలోకి అడుగుపెట్టారు.
అనంతరం రంగస్థలంపై తన ప్రతిభను చాటుకున్నారు. 1950లో విడుదలైన ‘షావుకారు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తొలి సినిమాతోనే ఆమె ‘షావుకారు జానకి’గా పేరు పొందారు.
షావుకారు జానకి, దాదాపు ఏడు దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 380కి పైగా చిత్రాల్లో నటించారు.
అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి పలువురు సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించారు. వయసు పెరిగిన తర్వాత అక్క, వదిన, తల్లి, అత్త వంటి అనేక పాత్రలు చేసి వాటిలో కూడా తనదైన ముద్ర వేశారు.
సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. షావుకారు జానకి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు.