అదివారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్!

August 23, 2026
img

తెలంగాణలో అదివారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్‌లు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టినప్పుడు దాని వలన ఆటో డ్రైవర్లు నష్టపోతారు కనుక వారికి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఆ హామీ అమలుచేయలేదు. కనుక ఆ బకాయిలు చెల్లించాలని, ప్రైవేట్ రవాణా రంగంలో పనిచేస్తున్న తమ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

గత ప్రభుత్వం అమలు చేసిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలను సవరించాలని కోరుతున్నారు. అలాగే అక్రమంగా నడుస్తున్న మొబైల్ యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలపై  నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

క్యాబ్, ఆటో సేవల కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరుతున్నారు. 

ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఆసక్తి చూపకపోవడం వల్లనే నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాల్సి వచ్చిందని జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. కనుక ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. 

Related Post