నేను తప్పుగా మాట్లాడలేదు.. నోటీస్ వెనక్కు తీసుకోండి: చిన్నారెడ్డి

August 22, 2026


img

తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి స్పందించారు. 

తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంటూ క్రమశిక్షణా కమిటీకి సుదీర్ఘ లేఖ రాశారు.

వనపర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యవహారశైలిపై తాను చేసిన వ్యాఖ్యలను చిన్నారెడ్డి సమర్థించుకున్నారు. 

ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడ కారణంగా గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న నిబద్ధత కలిగిన నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చిన్నారెడ్డి తెలిపారు. గాంధీ భవన్, ఇందిరా భవన్ తనకు దేవాలయాలతో సమానమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తాను అత్యంత గౌరవిస్తానని పేర్కొన్నారు. పరిస్థితి హద్దు దాటుతోందన్న ఉద్దేశంతోనే పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లానని వివరించారు.

వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చిన్నారెడ్డి గతంలో బహిరంగంగా విమర్శించారు. 

తన భావప్రకటనను తప్పుగా అర్థం చేసుకుని నోటీసులు జారీ చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చిన్నారెడ్డి కోరారు.


Related Post