మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో 18 ఏళ్ళ యువకుడు కునాల్ చాంద్‌వడే, అతడి తండ్రి మురళీధర్, తల్లి సంగీత మృతి చెందారు.
కొత్త ఐఫోన్ కొనివ్వాలంటూ కునాల్ చాంద్‌పడే శుక్రవారం ఉదయం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. కానీ తమ ఆర్ధిక పరిస్థితిలో అంత ఖరీదైన ఫోన్ కొనలేమని తల్లితండ్రులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఐఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కునాల్ చాంద్‌పడే ఊరి శివారులోని కొండపైకి వెళ్లాడు.
అతనిని వారిస్తూ తల్లితండ్రులు, ఇరుగు పొరుగులు కూడా పరుగు తీశారు. కానీ కునాల్ చాంద్‌పడే కొండ అంచున నిలబడి ఎవరైనా దగ్గరకు వస్తే కిందకు దూకుతానని బెదిరించాడు. తల్లితండ్రులు ఎంత సేపు బ్రతిమిలాడినా అతను వెనక్కి రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని, అతనికి నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు.
కొండ అంచున నిలబడిన కునాల్ బ్యాలన్స్ కోల్పోయి పడిపోతుంటే, సమీపంలోనే ఉన్న తండ్రి మురళీధర్ కొడుకుని రక్షించేందుకు చెయ్యి అందించాడు. కానీ ఇద్దరూ కింద బండరాళ్ళపై పడి చనిపోయారు. భర్త, కుమారుడు కళ్ళెదుటే కొండపై నుంచి కిందపడి చనిపోవడం చూసి తట్టుకోలేకపోయిన తల్లి సంగీత కూడా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఓ ఐఫోన్ కోసం కొడుకు, అతని కోసం తండ్రి, వారి కోసం తల్లి ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడంతో అందరూ దిగ్బ్రాంతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.