హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీనికి ప్రధాన కారణం కేవలం50 చ.గజాలలో ఏడంతస్తులు నిర్మించడమే. ఆ ప్రాంతంలో అటువంటి భవనాలు చాలా ఉన్నందున, వాటి మద్య ఇరుకు ప్రదేశంలో బలమైన పునాదులు వగైరా లేకుండా ఈ భవనాన్ని నిర్మించడంతో కుప్పకూలింది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు భవనంలో టైల్స్ పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే (34), మోపత్ (42) శిధిలాలలో చిక్కుకొని మరణించారు. ఈ భవనం పక్కనే ఉన్న భవనంపైకి ఒరిగి కూలడంతో అది కూడా పాక్షికంగా దెబ్బతింది.
సమాచారం అందుకున్న హైడ్రా కమీషనర్ రంగనాథ్, సైబరాబాద్ కమీషనర్‌గా సృజన, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తదితరులు అక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చుట్టుపక్కల ప్రమాదకరంగా ఉన్న భవనాలలో నివసిస్తున్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో నిబంధనలకు విరుద్దంగా లేదా ఉల్లంఘించి నిర్మించిన భవనాలన్నిటినీ కూల్చేస్తామని కనుక వాటిలో నివసిస్తున్నవారు వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ చెప్పారు.
అగ్నిమాపక శాఖ, హైడ్రా సిబ్బంది భావన శిధిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉండవచ్చని శిధిలాలు తొలగింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారిలో ఉన్న భవన యజమాని సాజిద్ కోసం గాలింపు మొదలుపెట్టారు.