గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన టాక్సిక్ ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్, మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ వేడుకలో చిన్న ప్రమాదం జరిగింది.
సౌండ్ బాక్సుల కోసం ఏర్పాటు చేసిన సుమారు 12 అడుగుల ఎత్తైన ఓ ఇనుప స్టాండ్‌పైకి విద్యార్ధులు ఎక్కికూర్చున్నారు.
యష్ ప్రసంగిస్తుండగా అది కూలిపోయి దానిపై కూర్చొన్న విద్యార్ధులు కిందపడిపోయారు. వారిపై ఆ ఇనుప స్టాండ్ పడటంతో గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి విద్యార్ధులను ఉద్దేశ్యించి, “మీరు మల్లారెడ్డి పేరు నిలబెట్టాలి కానీ ఈవిధంగా చేయకూడదు. మన యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఈవిధంగా జరగడం సరికాదు. మన ప్రవర్తన ఎల్లప్పుడూ సరిగ్గా ఉండాలి. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరిగితే మన యూనివర్సిటీలో ఇకపై ఇలాంటి కార్యక్రమాలు జరుగవు. అందరూ గుర్తుంచుకోండి,” అంటూ విద్యార్ధులను హెచ్చరించారు.
యూనివర్సిటీలో అలాంటి సినిమా ఫంక్షన్ నిర్వహించడమే తప్పు. కానీ ఆ కార్యక్రమాన్ని చూసేందుకు విద్యార్ధులు ఇనుప స్టాండ్ మీద ఎక్కి పడిపోతే.. వారి పరిస్థితి గురించి మాట్లాడాల్సిన ప్రీతిరెడ్డి విద్యార్ధులను ఈవిధంగా హెచ్చరించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.