చెన్నైలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను హత్య చేసిన దంపతులు ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటితో బిర్యానీ వండారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే చెన్నైలో ఇది జరిగినపుడు ఎవరూ గుర్తించలేదు.
ఈ నెల 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ సూట్‌కేస్ నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు సూట్‌కేస్‌ను తనిఖీ చేయగా అందులో మానవ శరీర భాగాలు గుర్తించారు.
అయితే హంతకులు తెలివిగా చెన్నైలో ఆ ఎక్స్‌ప్రెస్‌లో సూట్ కేసు పెట్టి, లోకల్ రైలులో తిరిగి వెళ్ళిపోయారు. కనుక ఆగ్రా పోలీసులు సూట్ కేస్ స్వాధీనం చేసుకొని తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చెన్నై రైల్వే స్టేషన్, లోకల్ రైల్వే స్టేషన్లలో, వాటి పరిసర ప్రాంతాలలో 350 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి హంతకులను గుర్తించారు.
వారిని ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతడి భార్య భాగమి మాజిక్‌గా గుర్తించారు. చెన్నై పోలీసులు మాణిక్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా, వంటగదిలోని కుక్కర్‌లో అన్నంతో పాటు మానవ శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.
ఒడిశాకు చెందిన హయాత్ నిషా భర్త నుంచి విడిపోయి చెన్నై వచ్చి మాణిక్ దంపతులతో కలిసి ఉంటోంది. ఆమెనే వారు హత్య చేసి ఆమె మాంసంతో బిర్యాని వండినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని, మాణిక్ దంపతుల కోసం గాలింపు మొదలు పెట్టారు. వారు దొరికితే వారు ఆమెను ఎందుకు అంత దారుణంగా హత్య చేశారో.. ఆమె మాంసంతో బిర్యానీ వండుకొని తినాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుస్తుంది.