కాళేశ్వరంపై దుష్ప్రచారం చేశారుగా.. ఇప్పుడు చెప్పండి: హరీష్‌ రావు

August 25, 2026


img

గత రెండున్నరేళ్ళుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఇక పనికి రాదన్నట్లు వాదిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై లోతుగా అధ్యయనం చేసిన ‘ఎన్‌డీఎస్ఏ’, ‘సిడబ్ల్యూ పిఆర్ఎస్’ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్‌ తప్ప మిగిలినవన్నీ బాగానే ఉన్నాయని తేల్చి చెప్పాయి. 

కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని తేల్చి చెప్పాయి. అన్నారం, సుందిళ్ళలోని నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని స్పష్టం చేశాయి. 

వాటి అఫిడవిట్, నివేదికలపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందిస్తూ, “కాళేశ్వరం మొత్తం కుప్పకూలిందని, ప్రాజెక్టు పనికిరాదని, ఈ ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎత్తిపోయలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలయ్యింది. 

అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని ‘ఎన్‌డీఎస్ఏ’ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అలాగే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయని ‘సిడబ్ల్యూ పిఆర్ఎస్’ స్పష్టం చేసింది. గోదావరి నీటిని నిలువ చేసుకొని అవసరమైనప్పుడు ఎత్తిపోసుకోవచ్చని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము.  

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం వదిలేసి గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేసింది. మేము గట్టిగా నిలదీసిన తర్వాతే దేవాదుల, నంది పంపులను ఆలస్యంగా ఆన్ చేశారు. కానీ అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్ళిపోయింది. గోదావరి జలాలను కిందికి వదిలేయడం వల్ల తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది,” అని హరీష్‌ రావు అన్నారు.  

“దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం 35.6 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. 

కనీసం ఇప్పటికైనా కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి అన్నారం, సుందిళ్ల మోటార్లను ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాలి,” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 

“ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్‌లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయ కక్షలు, కమిషన్లు, విచారణలకు సమయం కాదు. తెలంగాణ నీటి ప్రయోజనాలు, ప్రాజెక్టుల నిర్వహణ, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను పక్కనపెట్టి రాష్ట్ర రైతాంగానికి నీరందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిది,” అని హరీష్‌ రావు అన్నారు.


Related Post