కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో తల్లి చనిపోతే దోషమని, దాని వలన ఇంట్లో నివసిస్తున్న తమ కుటుంబాలకు కీడు జరుగుతుందనే మూఢనమ్మకంతో కన్నా కొడుకులే తల్లిని బావిలో పడేశారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, వృదాప్య సమస్యలతో బాధపడుతున్న నూనె వెంకటమ్మ (80) చాలా కాలంగా మంచానికే పరిమితమయ్యారు.
ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారు. అయితే ఇంట్లో తల్లి మృతి చెందితే ఆ దోషం వలన తమకు కీడు జరుగుతుందని, అది తప్పించుకునేందుకు ఆ ఇంటిని వదిలివెళ్ళాల్సి వస్తుందని పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ భావించారు.
కనుక ఇద్దరూ తల్లి వెంకటమ్మను మోసుకు వెళ్ళి ఇంటికి దూరంగా ఉన్న వ్యవసాయ బావిలో పడేశారు. ఆ హత్యా నేరం తమపైకి రాకుండా తప్పించుకునేందుకు, మరుసటి రోజు తమ తల్లి కనిపించడం లేదంటూ కుమారులు గ్రామంలో వెతికారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేశారు. పోలీసులు కూడా గాలించి వ్యవసాయ బావిలో శవమై తేలున్న వెంకటమ్మని బయటకు తీశారు.
ఆమె శవాన్ని పోస్టు మార్టంకు తరలించిన తర్వాత, అసలు నడవలేని స్థితిలో ఉన్న ఆమె అంత దూరంగా ఉన్న ఆ బావి వద్దకు ఎలా వెళ్ళారని కొడుకులను ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక తడబడ్డారు.
పోలీసులు తమదైన శైలిలో వారిని ప్రశ్నించగా తామే తల్లిని మోసుకెళ్ళి బావిలో పడేసి హత్య చేసినట్లు సమ్మయ్య, శ్రీనివాస్ అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
నిసహాయ స్థితిలో ఉన్న కని పెంచిన తల్లి బ్రతికి ఉండగానే కన్న కొడుకులు బావిలో పడేసి హత్య చేయడం చాలా దారుణమే కదా?