మోడీ మంత్రి వర్గ విస్తరణపై రేపు ప్రకటన?

August 26, 2026


img

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ చర్చ జరుగుతున్న ఈ సమయంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ అధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళనల కారణంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.కానీ మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తూనే ఉంది.

త్వరలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఇటువంటి పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోడీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ శుక్రవారం ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. దానికి ముందు రోజు అంటే రేపు బిజేపితో సహా ఎన్డీయే మిత్ర పక్షాలకు చెందిన 20 మంది ఎంపీలను తన నివాసంలో ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బహుశః మంత్రి వర్గ విస్తరణ గురించే వారిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి బొగ్గుశాఖ మంత్రిగా ఉండగా, బండి సంజయ్‌ హోంశాఖ సహాయ మంత్రిగా చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ నుంచి టీడీపికి చెందిన రామ్మోహన్ నాయుడు పౌరవిమానయానశాఖ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి మరియు సమాచార ప్రసారాల (కమ్యూనికేషన్స్) శాఖ సహాయ మంత్రిగా చేస్తున్నారు. 

బిజేపి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణయే అని ప్రధాని మోడీ ప్రకటించినందున, తెలంగాణ బిజేపి ఎంపీల నుంచి మరొకరికి అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. రేపు ఎంపీలతో సమావేశం జరిగిన తర్వాత తెలంగాణకు మరో మంత్రి పదవి లభిస్తుందా? లేక ఉన్నదే ఊడుతుందా? స్పష్టత వస్తుంది.


Related Post