ఏదైనా ఒక భాష, యాస, సంస్కృతీ సంప్రదాయాలు బతికి కట్టాలంటే వాటికి ప్రజాదరణ చాలా ముఖ్యం. తెలంగాణ ఏర్పడక ముందు సినిమాలలో కామెడీ, విలన్ పాత్రలకు తెలంగాణ భాషని వాడారు.
కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ భాష, యాస, సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు, పబ్బాలకు సముచిత గౌరవం దక్కేలా చేశారు. అప్పటి నుంచి మొదలైన ఈ మార్పు ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి తెలంగాణలో పల్లెపల్లెకు పాకింది. ఇందుకు నిదర్శనంగా బలగం వంటి సినిమాలు కనిపిస్తున్నాయి.
ఇందుకు తాజా ఉదాహరణగా పెద్దపల్లి జిల్లా పెగడపల్లి గ్రామానికి చెందిన అల్లం మల్లమ్మ, గట్టయ్య దంపతులు తమ కుమారుడు వెంకటేష్ వివాహ ఆహ్వాన పత్రిక ఉంది. అచ్చమైన తెలంగాణ వాడుక భాష, యాసలో దానిని అచ్చేయించి బంధుమిత్రులను ఆహ్వానించగా ఆ లగ్గం పత్రికని చూసి మురిసిపోతున్నారు.
వారిలో కొందరు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ దీని గురించి వార్తలలో చెప్పాయంటే ఎంత వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ లగ్గం పత్రిక తెలంగాణ భాషకు, యాసకు లభించిన అరుదైన గౌరవమే కదా?