భారత్ నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిన యువతీ యువకులకు వారి తల్లితండ్రులు సరైన సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. యువతీ యువకులు అమెరికా నుంచి భారత్‌కు వచ్చి పెళ్ళి చేసుకుని జంటగా తిరిగి వెళుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే పిల్లలు అమెరికాలోనే పెళ్ళి చేసుకుంటే, అప్పుడూ తల్లితండ్రులు అక్కడికి వెళ్ళక తప్పదు. ఒకవేళ అనివార్య కారణాల వలన వెళ్ళలేకపోతే?
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో జయరాజు, జ్యోతి దంపతులు పరిష్కారం చూపారు. అమెరికాలో స్థిరపడిన వారి కుమార్తె హిమబిందుని అక్కడే పరిచయమైనా ఆంధ్రాకు చెందిన రోహిత్ కుమార్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.
కానీ ప్రస్తుతం వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావుడితో, పెళ్ళికి భారత్‌కి వెళ్తే రిటర్న్ వీసాకు సమస్యలు ఎదురవుతాయని భయపడ్డారు. కనుక అమెరికాలోనే స్థిరపడిన తమ బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు.
సూర్యాపేటలో ఉన్న వధువు తల్లితండ్రులు వారి వివాహానికి వెళ్ళలేకపోయారు. ఈ విషయం ముందే చెప్పారు కనుక వారి వివాహాన్ని ఆన్‌లైన్‌లో చూసేలా వెబ్ కాస్టింగ్ చేయించారు. దాంతో వేపలసింగారం గ్రామంలో జయరాజు, జ్యోతి దంపతులు కూతురు పెళ్ళి కళ్ళారా టీవీ స్క్రీన్ మీద చూస్తూ, దానిపైనే అక్షింతలు చల్లి ఆశీర్వదించి సంతోషపడ్డారు. అ తర్వాత గ్రామస్తులకు విందు భోజనం ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని వారితో పంచుకున్నారు. అమెరికాలో పెళ్ళికి సూర్యాపేటలో అక్షింతలన్న మాట!