తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం అవుతాయని శాసనసభ కార్యదర్శి సర్కులర్ జారీ చేశారు. ఈ మేరకు మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు.
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయాన్ని తొలి రోజు సభ ముగిసిన అనంతరం జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
ఈ సమావేశాల్లో వివాదాస్పద 22ఏ నిబంధన కింద ప్రైవేట్ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చడం, రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద జలాలను ప్రాజెక్టులలో నిలువ చేసి తెలంగాణ రైతాంగానికి అందించకుండా దిగువకు విడిచిపెడుతుండటం, సర్ పేరుతో ఓట్ల తొలగింపు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. వారిని అధికార కాంగ్రెస్ సభ్యులు ధీటుగా ఎదుర్కోవడం ఖాయం. కనుక ఎప్పటిలాగే ఈసారి కూడా శాసనసభ సమావేశాలు వాడి వేడిగా సాగుతాయి.
చట్టసభలకు యువతని పంపేందుకు వారు ఎన్నికలలో పోటీ చేసే వయసును 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు తగ్గించేందుకు శాసనసభలో తీర్మానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కనుక ఈ సమావేశాల్లో దీనిపై తీర్మానం చేసే అవకాశం ఉంది. మూసీతో సహా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై సమావేశాల్లో చర్చ జరుగుతుంది.
ఎప్పుడు శాసనసభ సమావేశాలు మొదలైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా? అనే చర్చ తప్పనిసరి. కనుక ఈసారి కూడా మొదలైంది. అయన శాసనసభకు వచ్చి చర్చలలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.