ఉంగరం తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటే.. రెండు ప్రాణాలు పోయాయి!

August 28, 2026
img

అవును. పశ్చిమ గోదావరి జిల్లాలో భార్యాభర్తలు ఇందువల్లే చనిపోయారు. దొడ్డసాయి(29), శిరీష (28) దంపతులు గురువారం రాత్రి తమ మూడేళ్ళ కుమార్తెని వెంటబెట్టుకొని జిల్లాలోని చించినాడ వద్ద వశిష్ట వంతెన వద్దకు వచ్చారు. మొదట కుమార్తెని కూడా పట్టుకొని గోదావరిలో దూకేద్దామనుకున్నారు.

కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకొని ఆ చిన్నారిని స్కూటిపై నిలబెట్టి ఇద్దరూ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దారిన వెళ్తున్న స్థానికులు పసిపాప ఏడుపు విని పరుగున వచ్చి ఎత్తుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వారిరువురి మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఈలోగా దొడ్డసాయి తన తండ్రికి పంపిన చివరి వీడియో మెసేజ్ చూశాక పరిస్థితి అర్దమైంది. 

సాయి చెప్పిన ప్రకారం వారిరువురికి వివాహం జరిగి ఆరేళ్ళు. ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చారు. కొంతకాలం హైదరాబాద్‌లో డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కానీ ఆదాయం సరిపోక స్నేహితుడిని సాయం అడగడంతో అతను తన ఉంగరం ఇచ్చాడు. దానిని తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నారు. కానీ వారి ఆర్ధిక పరిస్థితి ఇంకా దిగజారడంతో హైదరాబాద్‌ వదిలి భీమవరం వచ్చేశారు. అక్కడ వారి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. 

ఇదివరకు ఉంగరం ఇచ్చిన స్నేహితుడే దాని కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు భరించలేక ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ వీడియోలో సాయి చెప్పాడు.

అయితే అతని వద్ద ఉంగరం తీసుకొని తిరిగి ఇవ్వలేక, డబ్బు చెల్లించలేకపోతున్నామని కనుక తమ ఆత్మహత్యకు అతనికి ఎటువంటి సంబంధమూ లేదని వీడియోలో చెప్పాడు. తాము ఎవరినీ ఈ కేసులో ఇరికించాలని కోరుకోవడం లేదని, తమ సమస్యలు భరించలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సాయి చెప్పాడు. చివరిగా నాన్న జాగ్రత్త. ఇదే చివరి మాట,” అంటూ వీడియో ముగించాడు. 

Related Post