ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. కనుక ఎప్పటిలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా? అనే చర్చ మొదలైంది. సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు. సభలో అయన గౌరవానికి భంగం కలుగకుండా చూసుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇస్తున్నారు. ఒకవేళ అవసరమైతే అయన ఇంటికి కారు పంపిస్తానని అన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రతీ ఆరోపణపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కనుక కేసీఆర్ శాసనసభకు రావాలని సవాళ్ళు విసురుతున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రుల సవాళ్ళపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, “కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రావాలని పదేపదే అడుగుతున్నారు. కేసీఆర్ తప్పకుండా వస్తారు. ఎప్పుడంటే మళ్ళీ అయన ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతారు,” అని చెప్పారు. అంటే మరో రెండేళ్ళ వరకు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కాబోరని కేటీఆర్ స్పష్టం చేశారన్న మాట.
శాసనసభ సమావేశాలకు హాజరు కానప్పుడు కేసీఆర్ రూ. 24 కోట్లు జీతం ఎందుకు తీసుకుంటున్నారు? దానిని ఆయన వదులుకోవాలి కదా? అనే సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు.