తెలంగాణ మంత్రులలో సగం మంత్రి ఢిల్లీలోనే...

September 02, 2026


img

తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు, విస్తరణ జరుగబోతునందున, మంత్రులలో సగం మంది ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్‌ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్గంగా సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించారు.

అధిష్టానం పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ కూడా ఢిల్లీ చేరుకున్నారు. వారితో కూడా ఈ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిల వ్యవహారంపై చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.  

మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు మంత్రులను తప్పించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. నేడు డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు.

మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిల వివాదాల కారణంగా ఇప్పుడు పలువురు మంత్రులకు పదవీ గండం ఏర్పడినట్లే కనిపిస్తోంది. ఈ నెల 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. బహుశః నాలుగైదు రోజుల పాటు సాగే ఆ సమావేశాలు ముగిసిన తర్వాతే కాంగ్రెస్‌ అధిష్టానం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.


Related Post