హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆయుధాల గదిలోకి ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 12 ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
వీటిలో నాలుగు ఏకే-47లు, ఆరు రివాల్వర్స్, ఒక అసాల్ట్ రైఫిల్ ఉన్నాయి. వీటిపాటు వీటికి అవసరమైన మందుగుండు సామగ్రిని కూడా దొంగలు ఎత్తుకెళ్ళారు.
సోమవారం ఉదయం ఆర్మీ అధికారులు ఇది గుర్తించి వెంటనే బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు, మందు గుండు భద్రపరుస్తారు. కనుక అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. కనుక సిబ్బందిలోనే ఎవరో ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చు లేదా దొంగలకు సహకరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలు చాలా బరువుగా ఉంటాయి. కనుక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.
రెజిమెంట్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు, ఆర్మీ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు లోనికి ఎలా ప్రవేశించారు. ఆయుధాల గది ఎక్కడ ఉందొ వారికి ఎలా తెలుసు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన అక్కడికి వారు ఎలా చేరుకున్నారు? ఆయుధాల గది తాళాలు ఎలా తెరిచారు? అక్కడి నుంచి మళ్ళీ అన్ని ఆయుధాలతో ఎవరి కంట పడకుండా బయటకు ఎలా వెళ్ళగలిగారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటోన్మెంట్‌లోపల, పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి దొంగలను గుర్తింఛి వారి కోసం గాలింపు మొదలుపెట్టారు.
మరోవైపు అత్యంత భద్రత కలిగిన ఉన్న కంటోన్మెంట్‌లో ఆయుధాల చోరీపై ఆర్మీ అధికారులు సిబ్బందిని అంతర్గతంగా విచారిస్తున్నారు. ఇది రక్షణ శాఖకు సంబందించిన వ్యవహారం అయినందున పోలీసులు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించలేమని స్పష్టం చేశారు.