నా కూతురు అన్నదాంట్లో తప్పేముంది? కొండా సురేఖ

September 02, 2026


img

కొండా సుష్మిత తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరులపై చేసిన సంచలన వ్యాఖ్యలు, హెచ్చరికల నేపధ్యంలో మంత్రి కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్దమయ్యింది. దాంతో కొండా సురేఖ రాఖీ పండుగనాడు సిఎం నివాసానికి వెళ్ళి రేవంత్‌ రెడ్డికి బంగారు రాఖీ కట్టారు. తద్వారా సిఎంతో ఆమె రాజీకి ప్రయత్నించారని అర్ధమవుతోంది.

కానీ ఢిల్లీలో  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో చర్చల తర్వాత తనపై వేటు తప్పదని గ్రహించినట్లున్నారు.

అంతే! ఆమె స్వరం మార్చి, “నాపై వేటు వేయాలంటే ముందు నాకు వ్యతిరేకంగా మాట్లాడినవారందరిపై కూడా వేటు వేయాలి. అయినా నా కూతురుకు స్వేచ్చగా మాట్లాడే హక్కుంది. ఆమెను నియంత్రించే హక్కు నాకు లేదు. కనుక ఆమె మాట్లాడిన మాటలకు మంత్రినైన నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడమే తప్పు. నేను కూడా ఏఐసిసి సభ్యురాలినే. కనుక ఇదే విషయం చెప్పాను. నాకు వ్యతిరేకంగా పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని, తెర వెనుక ఉండి ఈ కథ నడిపిస్తున్నవారెవరో నాకు తెలుసు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాను. అయినా రాహుల్‌ గాంధీ మాట కూడా లేక్కలేదా?” అని మంత్రి కొండా సురేఖ అన్నారు.     

అయితే ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె బహిరంగంగా ఈవిధంగా మాట్లాడినందున, ఇక కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆమెను ఉపేక్షించలేని పరిస్థితి కల్పించుకున్నారని చెప్పవచ్చు. 

మరో పక్క మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మళ్ళీ మొదలెట్టేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నత పదవులలో సెటిల్ అయిపోయి, మా వంటి నిఖార్సయిన కాంగ్రెస్‌ నేతలను బయటకు పంపించాలని కుట్రలు చేస్తున్నారు. నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. మంత్రి పదవి నాకొక లెక్క కాదు. ఏనాటికైనా నేను తెలంగాణ సిఎం అవుతా,” అని అన్నారు.

కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరాన్నిఉపెక్షించలేరు. అలాగని పార్టీలో నుంచి తొలగిస్తే అయన వాదన నిజమని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. 

తెలంగాణ ఏర్పడిన పదేళ్ళవరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాలేకపోవడానికి కారణం కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్ఎస్‌ పార్టీ బలపడటం కాదు. పదవుల కోసం కాంగ్రెస్‌ నేతల ఈ కీచులాటలు, అనైఖ్యతే ప్రధాన కారణం.

ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చినట్లే అనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానం, సిఎం రేవంత్‌ రెడ్డి ఈ అసంతృప్తి నేతలను, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారో?


Related Post