కొండని కదిలించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి

September 03, 2026


img

మంత్రి కొండా సురేఖని పదవిలో నుంచి తప్పించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. సిఎం రేవంత్‌ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆమెను మంత్రి పదవిలో నుంచి తొలగించాలని పట్టుబట్టడంతో కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది.

అందువల్లే ఆమె నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ముందు సిఎం రేవంత్‌ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారని భావించవచ్చు. 

కాంగ్రెస్‌ సీనియర్ నేత చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కొండా సురేఖను మంత్రి పదవిలో నుంచి తొలగించాలంటే నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి. కనుక సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ తిరిగి రాగానే గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లాని కలిసి ఆమెను ఎందువల్ల తొలగించాల్సి వస్తోందో వివరిస్తారు. లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌ని కలిసి వివరించి అనుమతి పొందే అవకాశం ఉంది. 

ఒకవేళ కొండా దంపతులు పార్టీలోనే కొనసాగితే ఈవిధంగా మంత్రి పదవి కోల్పోయినందుకు ఆమె ఇకపై సిఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఇబ్బంది సృష్టించే అవకాశం ఉంటుంది. కనుక వారిని కాంగ్రెస్‌ పార్టీలో నుంచి కూడా తొలగిస్తారా?ఒకవేళ తొలగించకపోతే వారు పార్టీలోనే ఉంటారా? లేక పార్టీ మారుతారా? అనేది త్వరలో తేలిపోతుంది. 


Related Post