రెండు రోజులు ముందుగానే ఖైరతాబాద్ గణేశుడి దర్శన భాగ్యం

September 11, 2026
img

వినాయక చవితి ఉత్సవాలకు రెండు రోజులు ముందే హైదరాబాద్‌ నగరవాసులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవచ్చు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న (సోమవారం) ఉండగా సెప్టెంబర్ 12 నుంచే భక్తులు గణేశుడిని దర్శించుకునేందుకు నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఈసారి ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి కొలువుదీరనున్నాడు. విగ్రహానికి ఒకవైపు సోమనాథ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సహజ నది మట్టి, స్థానిక ఇసుక, ఎండిన వరి గడ్డి, నీటి ఆధారిత, సేంద్రియ రంగులను వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం మహాగణపతి ఆగమన కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విగ్రహానికి తుది రంగులు, అలంకరణ పనులు కొనసాగుతున్నాయి. కిరీటానికి వజ్రాలు, వైఢూర్యాలతో అలంకరణ చేస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య సేవలు, తాగునీరు, సమాచార కేంద్రం, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తున్నారు. 

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు 72 ఏళ్ళ  చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య ఒక అడుగు ఎత్తు గణేశుడి విగ్రహంతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఒక అడుగు చొప్పున ఎత్తు పెంచుతూ విభిన్న రూపాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 

తెలంగాణతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటారు.

Related Post