ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ఫుకెట్ నుంచి ఢిల్లీ చేరుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా సుమారు పదివేల అడుగుల మేర కిందకు దిగిపోయింది. విమానం ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి కిందకు జారిపోవడంతో పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఏఏఐబీ.. దర్యాప్తులో భాగంగా పైలట్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఒక పైలట్‌కు నాన్-నెగెటివ్ ఫలితం వచ్చినట్లు సమాచారం. దీంతో విమాన పైలట్ల డ్రగ్ టెస్టుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
విమాన ప్రయాణికుల భద్రత విషయంలో రాజీకి తావు లేకుండా దేశంలోని కమర్షియల్ పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించేలా నిబంధనలను కఠినతరం చేయాలని DGCA ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్నప్పటికీ.. ఏడాదిలో కేవలం 10 శాతం మంది పైలట్లకు మాత్రమే ర్యాండమ్‌గా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే ఇకపై ప్రతి పైలట్‌కు ఏడాదిలో కనీసం ఒకసారి డ్రగ్ టెస్ట్ నిర్వహించేలా నిబంధనలు మార్చే అంశాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇందుకు వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థలు, పైలట్ సంఘాలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతోంది.
ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించే ప్రక్రియను ప్రారంభించాయి. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశంలోని కమర్షియల్ పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు తప్పనిసరి కానున్నాయి.