ఏఐ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని సృజనాత్మకత చూసి మొదట అందరూ ఆశ్చర్యపోయేవారు. క్రమంగా దానికి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు వివిధ రంగాలలో నిపుణులు, ప్రముఖులు మొదలు సామాన్య ప్రజల వరకు అందరూ ఏఐని తెగ వాడేసుకుంటున్నారు.
తాజాగా దానిలో 1980’s రెట్రో ఏఐ ఫోటో ఫ్రెండ్ అనే టూల్ ద్వారా చాలా మంది తాము 1980లలో ఎలా ఉండేవారమో చూసుకుంటున్నారు. లేదా ప్రముఖుల ఫోటోలు అప్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకొని వినియోగించుకోవడంలో ముందుండే తెలంగాణ యువత 1980’s రెట్రో ఏఐ ఫోటో ఫ్రెండ్ అనే టూల్‌ని విరివిగా వాడేసుకుంటోంది. దీనిలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల ఫోటోలు కూడా ఉన్నాయి.
సిఎం రేవంత్ రెడ్డి గోధుమరంగు సూట్ ధరించి యమహ బైక్ ఆనుకొని నిలబడి ఉన్న ఫోటోలో అచ్చం సినిమా హీరోలా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీన్ ప్యాంట్, చొక్కా ధరించి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని స్టైల్‌గా కూర్చొని ఉండగా ఆయన వెనుక బల్లపై టేప్ రికార్డర్ ఉంది.
వీరిద్దరి రెట్రో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహుశః ఇక నుంచి మరింత మంది ప్రముఖుల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయేమో?